: కేరళలో లెఫ్ట్ లో చీలిక రానుందా?...సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన అచ్యుతానందన్
కేరళలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలను చూస్తుంటే ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయా? అనే సందేహాలు తలెత్తుతున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కేరళలో లెఫ్ట్ విజయంలో కీలక పాత్ర పోషించిన వామపక్ష వృద్ధ సింహం విఎస్ అచ్యుతానందన్ ను కాదని పినరాయి విజయన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేయడం ఆ పార్టీలో చీలికలు తెచ్చేలా కనబడుతోంది. తిరువనంతపురంలో ప్రకాశ్ కారత్, సీతారాం ఏచూరిలు నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పినరాయి విజయన్ ను ప్రకటించగానే సమావేశమందిరం నుంచి అచ్యుతానందన్ ఆవేశంగా వెళ్లిపోయారని సమాచారం. దీంతో అప్రమత్తమైన పెద్దలు అచ్యుతానందన్ ను ఫిడెల్ కాస్ట్రోతో పోల్చారు. అయితే, తనకు ప్రశంసలతో పని లేదని, ముఖ్యమంత్రి పదవే కావాలని ఆయన కోరుతున్నట్టు సమాచారం. దీంతో అప్రమత్తమైన లెఫ్ట్ నేతలు ఆయన పార్టీలో చీలిక తెచ్చే అవకాశం ఏమైనా ఉందా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. కాగా, కనీసం రెండేళ్లయినా తనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని అచ్యుతానందన్ వాదిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో విజయన్ పేరు ప్రకటించి గొప్ప పని చేశామని సంబరపడిన పెద్దలను ఆయన ఇరకాటంలో పడేశారు. ఇప్పుడు ఆయన శాంతించే వరకు వారిలో టెన్షన్ పెరిగిపోతోందని సమాచారం.