: మోదీ మంత్రం 2016లో పనిచేయదు: శివసేన
ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాలపై శివసేనాధిపతి ఉద్దవ్ ఠాక్రే మరోసారి పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో విమర్శలు కురిపించారు. మోదీ మంత్రం 2016లో పనిచేయదంటూనే తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి లభించిన ప్రయోజనం అంతా మిత్రపక్షాల చలవ వల్లే దక్కిందన్నారు. అసోంలో అసోం గణపరిషత్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ తో పొత్తు పెట్టుకోవడం వల్లే అధికారం సాధ్యమైందని చెప్పారు. అయితే, బిహార్ ఎన్నికల్లో పరాజయం చవిచూసిన తర్వాత తాజా ఫలితాలు ఆ పార్టీకి సంజీవని వంటివని రాయడం విశేషం. కేరళలో ఒకే ఒక సీటు తెచ్చుకుని అక్కడ ఖాతా తెరవడం ద్వారా బీజేపీకి మంచి రోజులు వచ్చాయంటూ ఆయన కామెంట్ చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రాన్ని బాంబులు, ఉగ్రవాదుల తయారీ కర్మాగారంగా అమిత్ షా విమర్శించగా... మరి ఆ రాష్ట్రంలో మమతాబెనర్జీ మరోసారి అధికారంలోకి ఎలా వచ్చారని ప్రశ్నించారు. అవినీతి, తీవ్రవాదం పెరిగిపోయిన ఈ రాష్ట్రాన్ని 'మమత విముక్త బెంగాల్' కావాలని బీజేపీ పిలుపునివ్వగా చివరికి ఏమైందని ప్రశ్నించారు.