: తడిసి ముద్దయిన విశాఖ... సీఎం పర్యటన రద్దు
రోను తుపాను విశాఖ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో నీరు తిష్ట వేసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి విశాఖ జిల్లా పర్యటన రద్దయింది. ఈ నెల 21న సీఎం పూడిమడకలో పర్యటించాల్సి ఉంది. 22వ తేదీ వరకు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించడంతో కార్యక్రమం వాయిదా వేసినట్టు కలెక్టర్ యువరాజ్ వెల్లడించారు. రోను తీవ్ర తుపానుగా మారుతున్న క్రమంలో భారీ వర్షాలు పడతాయన్న హెచ్చరికలతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. ఎలాంటి సాయం కోసమైనా, ఇతరత్రా సమాచారం కోసం 1800 425 0001, 0891 2549749 నంబర్లకు కాల్ చేయవచ్చని అధికారులు ప్రకటించారు. అలాగే అన్ని మండలాల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పాడేరు, అనకాపల్లి, రాంబిల్లి, చోడవరం, భీముని పట్నం, నర్సీపట్నం సహా జిల్లాలోని చాలా ప్రాంతాల్లో గురువారం భారీ వర్షాలు కురిశాయి. శుక్రవారం కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయని సమాచారం. విశాఖ నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొండవాలు ప్రాంతాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.