: ‘నోటా’కు స్పందన అంతంతే!... తమిళనాట ‘నోటా’కు ఓటేసింది 5.57 లక్షల మందే!


దేశ రాజకీయాల్లో తమిళ తంబీలకు ఓ ప్రత్యేకత ఉంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా... ఆ రాష్ట్రంలోని అధికార పార్టీని విపక్షంలో కూర్చోబెడుతున్న తమిళ ఓటర్లు... విపక్షంలోని పార్టీకి అధికారం కట్టబెడుతూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అయితే మూడు దశాబ్దాల తర్వాత తొలిసారి అధికారంలోని పార్టీకే తిరిగి అధికారమిచ్చి నిన్నటి ఎన్నికల ఫలితాల్లో తమ విలక్షణమైన తీర్పునిచ్చారు. ఈ క్రమంలో నచ్చని అభ్యర్థులను తిరస్కరించే విషయంలో తమిళ ఓటర్లు మిగిలిన రాష్ట్రాల ఓటర్ల కంటే పెద్దగా స్పందిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. బరిలో నిలిచిన అందరు అభ్యర్థుల్లో ఏ ఒక్కరు నచ్చకుంటే ‘నన్ ఆఫ్ ద అబోవ్ (నోటా)’ బటన్ పై ఓటేయాలని ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఈ బటన్ పై ఓటేస్తున్న ఓటర్ల సంఖ్య నానాటికీ పెరుగుతుందని, రాజకీయ పార్టీలు నేరచరితులను బరిలోకి దింపే విషయాన్ని పునరాలోచిస్తాయని అంతా భావించారు. అయితే ఆ దిశగా ఓటర్లు తమ ప్రత్యేకతను చాటడం లేదు. ఇందుకు నిదర్శనంగా నిన్న వెలువడ్డ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ‘నోటా’కు ఓటేసిన వారి సంఖ్య చాలా తక్కువగా నమోదైంది. ఈ ఎన్నికల్లో పుదుచ్ఛేరిలో 1.7 శాతం మంది (13,240) ఓటర్లు, పశ్చిమబెంగాల్ లో 1.5 శాతం (8,31,836) మంది ఓటర్లు ‘నోటా’ను నొక్కారు. ఇక తమిళనాడులో 1.3 శాతం (5,57,888) మంది, అసోంలో 1.1 శాతం (1,88,978) మంది, కేరళలో 0.5 శాతం (1,07,106) మంది ఓటర్లు ‘నోటా’కు ఓటేశారు.

  • Loading...

More Telugu News