: అసోంలో ‘కమలం’ వికాసానికి... సహకరించిన కాంగ్రెస్ మాజీ నేత!
వరుస ఎదురు దెబ్బలతో తలబొప్పి కడుతున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి నిన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాస్తంత ఊరట లభించిందనే చెప్పాలి. ఈశాన్య భారతంలోని అసోంలో ఆ పార్టీ... కాంగ్రెస్ నేతృత్వంలోని తరుణ్ గొగోయ్ సర్కారును గద్దె దించేసింది. ఈ విజయం ఆ పార్టీకి భారీ విజయమనే చెప్పాలి. ఎన్నికలకు కాస్తంత ముందుగా కేంద్ర మంత్రిగా ఉన్న పార్టీ యువనేత సర్బానంద సోనోవాల్ కు పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించిన జాతీయ నాయకత్వం... ప్రచారంలోనూ ఆయనకు ఫ్రీ హ్యాండిచ్చింది. తన రాజకీయ జీవితంలో అవినీతి మకిలి అంటని స్వచ్ఛమైన నేతగా పేరు తెచ్చుకున్న సోనోవాల్ నిజంగా పార్టీ పురోభివృద్ధికి కృషి చేశారు. అయితే సోనోవాల్ ఒక్కరితోనే ఆ రాష్ట్రంలో బీజేపీకి విజయం దక్కలేదు. బీజేపీకి దక్కిన ఈ అఖండ విజయానికి, కాంగ్రెస్ ఘోర పరాభవానికి... కాంగ్రెస్ లో పుట్టి పెరిగి, ఇటీవలే ఆ పార్టీకి చేయిచ్చిన హిమంత విశ్వశర్మ రచించిన వ్యూహమే కారణమట. పార్టీ అధిష్ఠానం వైఖరితో విసుగు చెందిన విశ్వకర్మ గతేడాది కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. అప్పటిదాకా తరుణ్ గొగోయ్ కేబినెట్ లో కీలక మంత్రిగా వ్యవహరించిన ఆయనకు సీఎంతో విభేదాలు ఏర్పడ్డాయి. కారణాలపై ఆరా తీయని కాంగ్రెస్ అధిష్ఠానం... విశ్వశర్మ వాదనను పట్టించుకోకుండా, గొగోయ్ కే మద్దతు పలికింది. దీంతో చిన్నబుచ్చుకున్న విశ్వశర్మ పార్టీకి రాజీనామా చేశారు. అమిత్ షా సమక్షంలో కమలదళంలో చేరారు. సోనోవాల్ తో కలిసి ముందుకు సాగారు. సోనోవాల్ నిజాయతీ, విశ్వశర్మ వ్యూహాలే... అసోంలో బీజేపీ విజయానికి బాటలు వేశాయని రాజకీయ విశ్లేషణలు సాగుతున్నాయి. ఇక పోనోవాల్ సీఎం పదవిని చేపట్టనుండగా, విశ్వశర్మకు డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.