: ఆ ఆరోపణలకు ఆత్మహత్య చేసుకోవాలనిపించింది: ఎంపీ తోట నరసింహం
ఫొటో మార్ఫింగ్ చేశారంటూ తనపై వచ్చిన ఆరోపణలపై టీడీపీ ఎంపీ తోట నరసింహం కన్నీటి పర్యంతమయ్యారు. తనపై ఆరోపణలు వచ్చిన రోజు రాత్రి తాను పడ్డ ఆవేదన అంతాఇంతా కాదని, ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని అన్నారు. అయితే, ఒక పనికిమాలిన వ్యక్తి తనపై చేసిన ఆరోపణలకు ఆత్మహత్య చేసుకోవడం సరికాదని విరమించుకున్నట్లు చెప్పారు. ఈ ఆరోపణలు చేసిన లాయర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా మీడియాపై కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. సైకో లాయర్ చేసిన ఆరోపణలపై తనను మీడియా కోలుకోలేని దెబ్బతీసిందన్నారు. లాయర్ ఫిర్యాదు నిరాధారమైందంటూ బాలల హక్కుల కమిషన్ కు పోలీసులు నివేదిక ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. తనకు వారసత్వంగా వచ్చిన పెంకుటిల్లు, 6.30 ఎకరాల పొలం తప్పా తానేమి సంపాదించలేదన్నారు. కాగా, బాలికల నగ్న చిత్రాలు పంపిణీ చేస్తున్నారంటూ ఎంపీ తోట నరసింహంపై జాతీయ బాలల హక్కుల కమిషన్ లో న్యాయవాది ఎస్.రవి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.