: యూరప్ దేశాలన్నింటినీ యాపిల్ పరిశీలించింది.. చివరికి హైదరాబాద్ నే ఎన్నుకుంది: కేసీఆర్
హైదరాబాద్ గచ్చిబౌలికి దగ్గరలోని నానక్ రామ్ గూడలో యాపిల్ సీఈవో టిమ్ కుక్ తో భేటీ అనంతరం పాలేరు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాపిల్ వంటి ప్రసిద్ధ కంపెనీలు హైదరాబాద్ కి వచ్చేలా చేస్తున్నామని, అయినా కూడా ప్రతిపక్షాలు తెలంగాణ ప్రభుత్వం చేస్తోన్న పనులను విమర్శిస్తూనే ఉన్నాయని అన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందని ఆయన అన్నారు. యాపిల్ సంస్థ యూరప్ దేశాలన్నింటినీ పరిశీలించిందని, భారత్‌లోని ఇతర రాష్ట్రాలను కూడా పరిశీలించిందని చివరికి తెలంగాణనే ఎంచుకుందని కేసీఆర్ తెలిపారు. చివరికి హైదరాబాద్ లో తమ కేంద్రాన్ని ప్రారంభించిందన్నారు. ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలయిన అమెజాన్, గూగుల్, యాపిల్, ఫేస్ బుక్ ఈ నాలుగు కంపెనీలు హైదరాబాద్‌కి వచ్చేశాయని, ఇంతటి ఘనతను సాధిస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం పట్ల తమ ఉద్దేశమేమిటని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల మన్ననలు అందుకుంటుంటే ప్రతిపక్షాలు తాము చేసే ప్రతీ పనిని విమర్శిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.