: కేరళలో ఓడిన క్రికెటర్.. అయినా ప్రజల కోసం పనిచేస్తానని ప్రకటన
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్ కు దూరమై రాజకీయంగానైనా ఓ వెలుగు వెలుగుదామన్న శ్రీశాంత్ ఆశలు ప్రస్తుతానికి ఫలించలేదు. కేరళ అసెంబ్లీ ఎన్నికల బరిలో తొలిసారిగా తిరువనంతపురం స్థానంలో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన అతడు ఓటమి చవిచూశాడు. మూడు రోజుల క్రితం పోలింగ్ రోజున ఎర్నాకులంలో తన ఓటు హక్కు వినియోగించుకుని తిరువనంతపురం చేరుకున్న శ్రీశాంత్ బీజేపీ అవకాశాలపై తాను ఆశాభావంతో ఉన్నానని మీడియాతో చెప్పిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. తమ పార్టీ 71+ సీట్లు సాధించే అవకాశం ఉందని ఆ సందర్భంలో శ్రీశాంత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కానీ, ఫలితాలను బట్టి చూస్తే కనీసం శ్రీశాంత్ తన స్థానంలోనైనా గెలవలేకపోయాడు. అయితే, ఓటమితో శ్రీశాంత్ కుంగిపోలేదు. తప్పకుండా ప్రజల కోసమే పనిచేస్తానని పేర్కొంటూ ట్వీట్ చేశాడు. తనకు మద్దతుగా నిలిచిన అందరికీ, వారి ప్రేమాదరణకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ట్విట్టర్ లో ఫాలోవర్లు కూడా శ్రీశాంత్ కే వెన్నుదన్నుగా నిలిచారు. కొత్తగా కెరీర్ ప్రారంభించావని, వచ్చేసారి తప్పక విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు, గట్టి పోటీ ఇచ్చావంటూ అభినందనలు వెల్లువెత్తాయి.