: దిగ్గజ సంస్థలు విఫలమైన వేళ, లోకల్ టీవీలు చెప్పిందే నిజమైంది!
"డీఎంకే 124 నుంచి 140 సీట్లు సాధిస్తుంది" ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన అనంతరం, తమిళనాడులో ఫలితాన్ని ఊహిస్తూ, యాక్సిస్ - మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ చెప్పిందిదే. "డీఎంకే 118 సీట్లు గెలుస్తుంది" న్యూస్ నేషన్ సర్వే వివరమిది. "డీఎంకే కూటమి 145 సీట్లు గెలిచి అధికారాన్ని పొందనుంది" ఇది ఇండియాటుడే వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ అంచనా. తమిళనాడులో జయలలిత తిరిగి అధికారంలోకి వస్తుందని టైమ్స్ నౌ-సీ ఓటర్స్ మాత్రమే తెలిపింది. అత్యధిక సంస్థలు కరుణానిధివైపే మొగ్గు చూపడంతో తమిళనాడులో సంప్రదాయం కొనసాగుతుందని అందరూ భావించారు. ఇదే సమయంలో తమిళనాడులో లోకల్ టీవీలు నిన్న సంచలన ప్రకటన చేశాయి. అన్నాడీఎంకే గెలవనుందని, ఎన్నికల రోజున వర్షం తగ్గిన తరువాత పడ్డ ఓట్లన్నీ జయలలిత పార్టీ అభ్యర్థుల ఖాతాల్లోకి వెళ్లాయని, చివరి రెండు గంటల్లో ఫలితం తిరగబడిందని పేర్కొన్నాయి. ఇప్పుడదే నిజమైంది. తమిళనాట స్పష్టమైన ఆధిక్యంతో జయలలిత పార్టీ దూసుకెళుతోంది. ఆమె నివాసం వద్ద అభిమానులు భారీ సంఖ్యలో చేరుకుని నృత్యాలు చేస్తూ, మిఠాయిలు పంచుకుంటున్నారు. ప్రస్తుతం అన్నాడీఎంకే 138 చోట్ల, డీఎంకే 91 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.