: 'చెన్నై' దూరమైనా, ఎంజీఆర్ రికార్డును సమం చేసిన జయలలిత!
30 సంవత్సరాల క్రితం ఎంజీ రామచంద్రన్ వరుసగా రెండుసార్లు తమిళనాట అధికారాన్ని చేపట్టగా, ఆపై ఆ ఫీట్ ను జయలలిత సాధించే దిశగా దూసుకెళుతున్నారు. 232 అసెంబ్లీ సీట్లలో అన్నాడీఎంకే 136 స్థానాల్లో ముందంజలో ఉండి, డీఎంకేను 93 సీట్లకే పరిమితం చేసింది. 1980 జూన్, 1985 ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి అన్నాడీఎంకే అధినేత ఎంజీ రామచంద్రన్, పార్టీని వరుసగా రెండుసార్లు అధికారానికి దగ్గర చేశారు. ఆయన రాజకీయ వారసురాలిగా వచ్చిన జయలలిత, ఇప్పటివరకూ ఐదు మార్లు సీఎం పీఠాన్ని అధిరోహించిన సంగతి తెలిసిందే. ఇక వరుసగా రెండోసారి అధికారాన్ని ఆమె చేపడితే, అది 30 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టినట్టే. కాగా, ఇక గత డిసెంబరులో కనీవినీ ఎరుగని వరదలు చెన్నై నగరాన్ని చుట్టుముట్టిన వేళ, జయలలిత ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలు చెన్నై వాసులకు అంతగా సంతృప్తిని కలిగించలేదని ఈ ఎన్నికలు తేల్చాయి. చెన్నై పరిధిలోని నియోజకవర్గాల్లో ఎక్కువ చోట్ల డీఎంకే అభ్యర్థులు ముందంజలో ఉండటమే ఇందుకు కారణం. చెన్నై నగరంలో 16 స్థానాలుండగా, డీఎంకే 11 చోట్ల విజయం దిశగా పరిగెత్తుతోంది. ఇక కోయంబత్తూరు, సేలం తదితర జిల్లాల్లో జయలలిత పార్టీ క్లీన్ స్వీప్ దిశగా నడుస్తుండగా, విల్లుపురం జిల్లాలో డీఎంకే సత్తా చాటింది.