: వైఎస్ జగన్ మామపై భూకబ్జా కేసు!... అరెస్ట్ కోసం రంగంలోకి ప్రత్యేక పోలీసు బృందాలు!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మామ, ఆ పార్టీ సీనియర్ నేత, కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై భూకబ్జా కేసు నమోదైంది. కేసు నమోదు చేయడంతోనే పనైపోయిందని భావించని సైబరాబాదు పోలీసులు వైసీపీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. 2012లో నమోదైన ఈ కేసు నిన్నటిదాకా దాదాపుగా మూసివేసిన స్థాయిలో ఉండగా, ఇటీవలే ఈ కేసు ఫైలుకు పోలీసులు బూజు దులిపారు. కేసు రిజిష్టర్ అయిన సందర్భంగా సేకరించిన ఆధారాలతో పాటు తాజాగా మరికొన్ని ఆధారాలను సేకరించిన పోలీసులు రవీంద్రనాథ్ రెడ్డి భూకబ్జాకు పాల్పడ్డారని నిర్ధారించారు. దీంతోనే ఆయనతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో రవీంద్రనాథ్ రెడ్డి ఏ-5గా ఉండగా, ముగ్గురు కీలక నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. కేసు వివరాల్లోకెళితే... రాష్ట్ర విభజనకు ముందు మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీలో సర్వే నెంబరు 11/30లో ప్లాట్ నెంబరు 864లో 300 చదరపు గజాల స్థలం ఉంది. ఈ స్థలం మెహిదీపట్నానికి చెందిన దామలచెరువు ప్రమీల అనే వృద్ధురాలి పేరట రిజిష్టరై ఉంది. అయితే పలువురు కబ్జాకోరులు ఈ భూమిని సొంతం చేసుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లాకు చెందిన శీనం ప్రతాప్ రెడ్డి, గోపవరపు నర్సింహారెడ్డి, రాజిరెడ్డితో పాటు హైదరాబాదులోని ఆల్వాల్ కు చెందిన ప్రతాప్ రెడ్డి రంగంలోకి దిగారు. స్థలానికి సంబంధించిన నకిలీ పత్రాలను సృష్టించారు. ఫోర్జరీ సంతకాలతో ఆ స్థలం తమదేనని ప్రకటించుకున్నారు. పనిలో పనిగా చుట్టుపక్కల ప్లాట్లను కూడా ఆక్రమించేశారు. శీనం ప్రతాప్ రెడ్డికి రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడి బ్యాంకు ఖాతా ద్వారా రూ.25 లక్షలు చెల్లించి సదరు భూమిని వైసీపీ నేత కొనుగోలు చేశారు. చివరగా ఆ భూమిని రవీంద్రనాథ్ రెడ్డి స్వయంగా తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీనిని ప్రశ్నించిన భూ యజమాని ప్రమీలను నిందితులు భయభ్రాంతులకు గురి చేశారు. ఈ క్రమంలో తన స్థలం కబ్జాకు గురైందని ప్రమీల 2012 ఏప్రిల్ 7న మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై నాడే కేసు నమోదైంది. అయితే నాడు తనకున్న రాజకీయ పలుకుబడితో రవీంద్రనాథ్ రెడ్డి కేసు దర్యాప్తును అడ్డుకున్నారన్న వాదన వినిపిస్తోంది. తాజాగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించడం, టీఆర్ఎస్ తొలి సర్కారును ఏర్పాటు చేయడం జరిగిపోయాయి. భూదందాలపై దృష్టిపెట్టిన ప్రభుత్వం భూ వివరాలపై ఓ కన్నేసింది. అదే సమయంలో పోలీస్ స్టేషన్లలో భూ పంచాయతీలకు అడ్డుకట్ట వేసేందుకు సైబరాబాదు కమిషనర్ రెండేళ్ల క్రితం ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్ఓపీ) రూపొందించారు. ఈ క్రమంలో ఇటీవల మాదాపూర్ ఇన్ స్పెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన కళింగరావు... ఈ కేసును తిరగదోడారు. ఎస్ఓపీ నిబంధనల ప్రకారం ప్రమీలతో పాటు ప్రతాప్ రెడ్డి ముఠా ఇచ్చిన పత్రాలను పరిశీలించారు. ఆ భూమికి సంబంధించి రెండు వర్గాలు అందించిన పత్రాలను సంబంధిత కార్యాలయాలకు పంపారు. ఈ పరిశీలనలో ప్రమీల ఇచ్చిన పత్రాలే నిజమైనవని, ప్రతాప్ రెడ్డి ముఠా ఇచ్చిన పత్రాలు నకిలీవని తేలిపోయింది. దీంతో ప్రతాప్ రెడ్డి ముఠాకు చెందిన శీలం ప్రతాప్ రెడ్డి, గోపవరపు నర్సింహారెడ్డి, రాజిరెడ్డిలను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఐదో నిందితుడిగా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డిని ‘పరారీలో ఉన్న నిందితుడు’గా పోలీసులు పేర్కొన్నారు. అంతేకాక రవీంద్రనాథ్ రెడ్డి అరెస్ట్ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించినట్లు మాదాపూర్ పోలీసులు నిన్న ప్రకటించారు.