: మీ చిట్టా అంతా నా దగ్గర ఉంది జాగ్రత్త: డాక్టర్లకు కామినేని హెచ్చరిక
ప్రభుత్వ ఆసుపత్రులకు డాక్టర్లు ఎప్పుడు వస్తున్నారు? ఎప్పుడు వెళుతున్నారు? ప్రైవేటు నర్సింగ్ హోమ్ లలో ఎంతమంది పనిచేస్తున్నారన్న పూర్తి సమాచారం తన వద్ద ఉందని, నర్సింగ్ హోమ్ లే ముఖ్యమనుకుంటే రిజైన్ చేసి వెళ్లిపోవాలని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అనంతపురం వైద్యులను హెచ్చరించారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఆయన వివిధ విభాగాల అధిపతులతో సమావేశమయ్యారు. పేదలు మాత్రమే ప్రభుత్వాసుపత్రులకు వస్తారని గుర్తు చేసిన ఆయన, వైద్యుల్లో వ్యాపార ఆలోచన మారాలని, విధుల్లో అంకితభావం చూపితే, ప్రభుత్వం మంచి రివార్డులను అందిస్తుందని తెలిపారు. చిత్తశుద్ధితో పనిచేయాలని వైద్యులకు కామినేని సలహా ఇచ్చారు. కదిరి ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తూ, ప్రైవేటు నర్సింగ్ హోమ్ లో ఆపరేషన్లు చేస్తున్న డాక్టర్ త్రిలోక్ నాథ్ ను సస్పెండ్ చేస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. వచ్చే నెలలో అనంతలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తామని, రూ. 150 కోట్లతో హాస్పిటల్ నిర్మితమవుతుందని వివరించారు.