: రూ.99కే స్మార్ట్ ఫోన్!... వినియోగదారుల్లో పలు అనుమానాలు!
ప్రపంచంలోనే అత్యంత చౌక ధరకు స్మార్ట్ ఫోన్ ను అందిస్తామని నమోటెల్ అచ్చే దిన్ సంస్థ ప్రకటించింది. ఈ సందర్భంగా బెంగళూరులో సంస్థ ప్రమోటర్ మాధవ్ రెడ్డి మాట్లాడుతూ, మేకిన్ ఇండియాలో భాగంగా తయారు చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.99కే అందిస్తామన్నారు. మే 17 నుంచి 25వ తేదీ మధ్య ఈ ఫోన్ బుకింగ్ చేసుకోవచ్చని చెప్పారు. క్యాష్ ఆన్ డెలివరీతో దీనిని కొనుగోలు దారులకు సరఫరా చేస్తామన్నారు. అందుకు నామమాత్రపు రుసుం వసూలు చేస్తామన్నారు. అయితే, ఆధార్ కార్డు ఉన్న భారతీయులకు మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్ ను విక్రయిస్తామన్నారు. నమోటెల్. కామ్ సంస్థ వెబ్ సైట్ లో ఈ ఫోన్ ని పొందుపరిచారు. ఈ స్మార్ట్ ఫోన్ ను పొందదలచిన వారు బి మై బ్యాంకర్ డాట్ కామ్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఐడీ, పాస్ వర్డ్ ను పొందాలన్నారు. ఇందులో లాగిన్ అయ్యాక ఆన్ లైన్ రూపంలో నగదు చెల్లించాలని చెప్పారు. ఆ తర్వాత బీఎంబీ రెఫరెన్స్ ఐడీ అందుతుందన్నారు. వాటి ఆధారంగా నమోటెల్. కామ్ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఫొటో, ఆధార్ కార్డును జతచేస్తే స్మార్ట్ ఫోన్ ను జతచేస్తామన్నారు. దీని అసలు ధర రూ.2,999 ఉండగా, దీనిని రూ.99కి తగ్గించినట్లుగా ఆ సైట్ లో ఉంది. ఇక, ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే... నాలుగు అంగుళాల డిస్ ప్లే, 1జీబీ ర్యామ్, 4జీబీ అంతర్గత మెమొరీ, 1325 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.3 గిగా హెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 3 మెగా పిక్సల్ ముందు కెమెరా, 2 మెగా పిక్సల్ వెనుక కెమెరా తో రూపొందనున్న ఈ ఫోన్ తెలుపు, నలుపు రంగుల్లో లభించనుంది. కాగా, సదరు సంస్థ వెబ్ సైట్ ఓపెన్ కావడం లేదు. దీంతో పలు అనుమానాలు తలెత్తుతుండటం గమనార్హం.