: ‘బుడ్డా’ ఫ్యామిలీలో ‘ఆకర్ష్’ చిచ్చు!... జలదీక్షలో జగన్ కు అండగా బుడ్డా శేషారెడ్డి!
ఏపీలో అధికార పార్టీ టీడీపీ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’... కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి కుటుంబంలో చిచ్చు పెట్టింది. టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం నందమూరి తారకరామారావు కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన బుడ్డా వెంగళరెడ్డి... చనిపోయేదాకా టీడీపీలోనే కొనసాగారు. జిల్లాలోని ఆత్మకూరులో పట్టపగలు నక్సల్స్ విరుచుకుపడి వెంగళరెడ్డిని హత్య చేశారు. ఆ తర్వాత వెంగళరెడ్డి ముగ్గురు కుమారులు సీతారామిరెడ్డి, రాజశేఖరరెడ్డి, శేషారెడ్డిలు ఉమ్మడిగానే ముందుకు సాగారు. సీతారామిరెడ్డి తన తండ్రి స్థానంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓ దఫా విజయం సాధించారు. ఆ తర్వాత అనారోగ్యంతో ఆయన చనిపోయాక రాజశేఖరరెడ్డి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీని వీడిన రాజశేఖరరెడ్డి... వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీలో చేరిపోయారు. సోదరుడి అడుగుల వెంటే నడిచిన శేషారెడ్డి కూడా వైసీపీలో చేరారు. ఈ క్రమంలో గడచిన ఎన్నికల్లో రాజశేఖరరెడ్డి శ్రీశైలం నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ విసిరిన వలకు చిక్కిన రాజశేఖరరెడ్డి... జగన్ కు ఝలక్కిచ్చి ఇటీవలే సైకిల్ ఎక్కేశారు. అప్పటిదాకా ఒకే బాటలో నడిచిన బుడ్డా సోదరులు... ఈ కీలక పరిణామంతో విడిపోయారు. రాజశేఖరరెడ్డి టీడీపీలో చేరిపోయినా... శేషారెడ్డి మాత్రం సైకిల్ సవారీకి ససేమిరా అన్నారు. మూడు రోజుల క్రితం వైఎస్ జగన్ కర్నూలులో చేపట్టిన జలదీక్షకు శేషారెడ్డి హాజరయ్యారు. అంతేకాకుండా వేదికపై ఆయనే సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. జగన్ జలదీక్ష వేదికపై శేషారెడ్డి కనిపించడం జిల్లా రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆది నుంచి కలిసి ప్రయాణం సాగిస్తున్న బుడ్డా ఫ్యామిలీలో టీడీపీ ‘ఆకర్ష్’ చిచ్చు పెట్టిందని జిల్లా జనం గుసగుసలాడుకుంటున్నారు.