: నారావారిపల్లెకు నేను శాసనసభ్యుడిని!: వైసీపీ నేత చెవిరెడ్డి
వైసీపీ కీలక నేత, చిత్తూరు జిల్లా చంద్రగిరి శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి కొద్దిసేపటి క్రితం సంచలన వ్యాఖ్య చేశారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు నారావారిపల్లెకు తాను ఎమ్మెల్యేనంటూ ఆయన చేసిన వ్యాఖ్య ఆసక్తి రేకెత్తిస్తోంది. కృష్ణా నదిపై తెలంగాణ సర్కారు నిర్మిస్తున్న పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు నిరసనగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలులో చేపట్టిన జలదీక్ష నేటికి మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దీక్షా స్థలి వద్ద మాట్లాడిన చెవిరెడ్డి... చంద్రబాబు కూడా రాయలసీమకు చెందిన వ్యక్తేనని చెప్పారు. అంతేకాక తన సొంత జిల్లా చిత్తూరు జిల్లాలోనే చంద్రబాబు జన్మించారన్నారు. చంద్రబాబు సొంతూరు నారావారిపల్లె ఉన్న చంద్రగిరికి తాను ఎమ్మెల్యేనని ఆయన చెప్పుకొచ్చారు. అంటే, చంద్రబాబు సొంతూరు నారావారిపల్లెకు తానే ఎమ్మెల్యేనన్నారు. చంద్రబాబును నమ్మని చంద్రగిరి వాసులు జగనన్నపై విశ్వాసముంచి తనను ఎమ్మెల్యేగా గెలిపించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై చెవిరెడ్డి ఘాటు విమర్శలు గుప్పించారు.