: తదుపరి ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థినని నేను ఎన్నడూ చెప్పలేదు: బీహార్ సీఎం నితీశ్
‘తదుపరి ఎన్నికల్లో నేనే ప్రధాని అభ్యర్థినని నేను ఎన్నడూ చెప్పలేదు’ అని బీహార్ సీఎం నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్డీఏ, యూపీఏ కూటములకు ప్రత్యామ్నాయంగా దేశంలోని సామ్యవాదులందరూ ఏకం కావాలని పిలుపునిస్తూ.. పాట్నాలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తనను తానెప్పుడూ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించుకోలేదని, తాను మూర్ఖుడ్ని కాదని నితీశ్ అన్నారు. ప్రత్యేక భావజాలం ఉన్న పార్టీల నుంచి భారతావనికి విముక్తి కలిగించాలన్నదే తన లక్ష్యమని ఆయన తెలిపారు. భారత్లో రాజకీయ కూటమిగా ఏర్పడడానికి సామ్యవాదుల భావజాలం ఏనాడు ఆలోచించలేదని, సామ్యవాదులే కాకుండా బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యతిరేకించే వారందరూ ఒకే గొడుగు కిందికి రావాలని నితీశ్ పిలుపునిచ్చారు. సామ్యవాదులు భావజాలం పరంగా చాలా బలంగా ఉంటారని, కాని వారు ఓ సంస్థగా ఏర్పడడంలో బలహీనంగా ఉన్నారని ఆయన అన్నారు. అయితే ఆర్ఎస్ఎస్ భావజాలం పరంగా బలంగా లేదని కానీ అది సంస్థగా ఏర్పడి పురోగతి సాధించడంలో బలంగా ఉందని నితీశ్ పేర్కొన్నారు.