: భార్య మృతదేహాన్ని చూసి బోరున విలపించిన పిన్నమనేని


సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి, ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు చిన్న పిల్లాడిలా వలవలా ఏడ్చారు. మొన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత హైదరాబాదు సమీపంలోని తుక్కుగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పిన్నమనేని కారు బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సీటు బెల్టు పెట్టుకున్న కారణంగా పిన్నమనేని తీవ్ర గాయాలతో బయటపడ్డారు. అయితే కారులో ప్రయాణిస్తున్న ఆయన సతీమణి సాహిత్యవాణి, కారు డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయారు. ఆ తర్వాత పిన్నమనేనిని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించిన పోలీసులు, సాహిత్యవాణి, డ్రైవర్ మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి చేర్చారు. నిన్న సాయంత్రానికే పోస్టుమార్టం పూర్తి కాగా సాహిత్యవాణి భౌతికకాయం పిన్నమనేని సొంతూరు కృష్ణా జిల్లా రుద్రపాకకు చేరింది. ఇక ప్రమాదంలో అయిన గాయాలకు చికిత్స నేపథ్యంలో నిన్న రాత్రి దాకా అపోలో ఆసుపత్రిలోనే ఉన్న పిన్నమనేని కొద్దిసేపటి క్రితమే తన సొంతూరు చేరుకున్నారు. అక్కడ తన ఇంటి ముందు భార్య నిర్జీవంగా కనిపించడంతో తీవ్ర భావోద్వేగానికి గురైన పిన్నమనేని దు:ఖం ఆపుకోలేకపోయారు. వలవలా ఏడ్చారు. ఇన్నాళ్లూ అందరికీ ధైర్యం చెబుతూ వచ్చిన పిన్నమనేని వలవలా ఏడ్వడంతో అక్కడ గంభీర వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News