: పది రోజులుగా ట్రై చేస్తున్నా... దేవినేని స్పందించరేం?: హరీశ్ రావు
తాను పది రోజులుగా ఏపీ నీటి పారుదల మంత్రి దేవినేని ఉమతో చర్చించాలని ప్రయత్నిస్తుంటే, స్పందన రావడం లేదని తెలంగాణ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. కృష్ణా నదీ జలాల్లో తమకు ఉన్న హక్కుల మేరకే నీటిని వాడుకుంటున్నామని, పక్క రాష్ట్రాల నుంచి ఒక్క చుక్కను కూడా కోరుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. రాజోలిబండ మళ్లింపు స్కీమ్ కు ఉమ్మడి రాష్ట్రంలోనే ఆదేశాలు జారీ అయ్యాయని గుర్తు చేసిన ఆయన, ఇప్పుడు దాన్ని అమలు చేయాలని భావిస్తే చంద్రబాబు సర్కారు అడ్డుకుంటోందని, చర్చిద్దామని చూస్తే, దేవినేని ముందుకు రావడం లేదని హరీశ్ ఆరోపించారు. న్యాయపరమైన వాటాను తాము కోరుకుంటూ ఉంటే ఏపీ సర్కారు కొర్రీలు పెడుతోందని దుయ్యబట్టారు. బచావత్ ట్రైబ్యునల్ ఆదేశాలను ఏపీ పట్టించుకోవడం లేదని, పట్టిసీమ ప్రాజెక్టు నిర్మిస్తే, ఎగువ రాష్ట్రాలకు 45 టీఎంసీల వాటా మిగులుతుందన్న విషయాన్ని మరచారని హరీశ్ వ్యాఖ్యానించారు. గోదావరి జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీల వాటా ఉందని, తాము కట్టే ప్రాజెక్టులన్నీ పూర్తయినా, 200 టీఎంసీలను మించి వాడలేమని స్పష్టం చేశారు.