: ‘ఆప్’కు సరికొత్త నిర్వచనం చెప్పిన కాంగ్రెస్ నాయకులు
ఆప్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ అని తెలిసిన విషయమే. అయితే... ఆప్ కు కాంగ్రెస్ పార్టీ నాయకులు సరికొత్త నిర్వచనం చెప్పారు. ఆప్ అంటే 'అరవింద్ అడ్వర్టైజ్ మెంట్ పార్టీ' అంటూ కొత్త భాష్యం చెప్పారు. గత మూడు నెలల కాలంలో కేవలం దినపత్రికల్లో ప్రకటనల నిమిత్తం కేజ్రీవాల్ సర్కార్ రూ.14.5 కోట్లు ఖర్చు చేసిందన్న విషయం సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా తెలిసింది. దీంతో, కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శోభా ఓజా మాట్లాడుతూ, ఇంకా టీవీ, రేడియో, హోర్డింగ్ ల ప్రకటనలకు ఆప్ సర్కార్ ఎంత ఖర్చు పెట్టిందన్న విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వం ఆర్టీఐ ద్వారా వెల్లడించలేదన్నారు. ఈ ఖర్చు కూడా కలుపుకుంటే ప్రకటనల కోసం కేజ్రీ సర్కార్ ఖర్చు చేసిన మొత్తం రూ.100 కోట్లు ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.