: ఐదేళ్ల తరువాత కూడా ఏపీకి రూ.47 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉంటుంది: చంద్రబాబు
రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ అనేక సమస్యల్లో పడిపోయిందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఎంతో వెనుకబడి ఉందని, ప్రజల జీవితాలకి సంబంధించిన కీలక అంశంపై ఆనాడు పార్లమెంట్‌లో ఏక పక్షనిర్ణయం తీసుకున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అప్పట్లో ఇరు రాష్ట్రాలకు సమన్యాయం చెయ్యమని తాను కోరానని, అయినా రాష్ట్రానికి అన్యాయమే జరిగిందని ఆయన చెప్పారు. నాటి కాంగ్రెస్ నిర్ణయం ఆ పార్టీకే అవస్థలు తెచ్చిపెట్టిందని, 150 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ని ప్రజలు ఇంటికి పంపించారని ఆయన అన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమలైనా ఏపీకి లోటు బడ్జెట్టు, సమస్యలు తప్పవని ఆయన అన్నారు. తెలంగాణకి రూ.9వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉందని, కానీ ఏపీకి ఐదేళ్ల తరువాత కూడా రూ.47 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. విభజనలో ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల ఇలా జరుగుతోందని అన్నారు.