: గుంటూరులో గజదొంగ వెంకన్న అరెస్టు
గుంటూరు జిల్లాకు చెందిన గజదొంగ వెంకన్నను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీసీఎస్ అడిషినల్ ఎస్పీ వీపీ తిరుపాల్, అడిషినల్ ఎస్పీ భాస్కర్ రావు వివరాలు వెల్లడించారు. నర్సరావుపేట రూరల్ మండలం కేతానుపల్లి గ్రామానికి చెందిన రాయపాటి వెంకన్న అలియాస్ వెంకయ్య 2003 నుంచి తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, పెద్దాపురం, కర్నూలు సహా పలు ప్రాంతాల్లో భారీ చోరీలకు పాల్పడ్డినట్లు చెప్పారు. పలు పోలీస్ స్టేషన్లలో అతనిపై పలు చోరీ కేసులు నమోదై ఉన్నాయన్నారు. ఈ చోరీల నిమిత్తం వెంకన్నకు సహకరిస్తున్న వెల్లంపల్లి వినోద్ కుమార్, దినేష్ లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఆరు వాహనాలు, బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1.88 కోట్లు ఉంటుందని పోలీసు అధికారులు పేర్కొన్నారు.