: జగన్ దీక్ష జగన్నాటకం, ప్రాజెక్టులపై బాబ్లీకి వెళ్లి పోరాటం చేసిన చరిత్ర మాది: మంత్రి ప‌్రత్తిపాటి
రాష్ట్ర ప్రజల ప్రయోజనాలపై టీడీపీ వెనకడుగు వెయ్యదని, ప్రాజెక్టులపై బాబ్లీకి వెళ్లి పోరాటం చేసిన చరిత్ర తమదని అని ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. జగన్ దీక్ష జగన్నాటకమని, రాష్ట్రప్రయోజనాలు జగన్‌కి పట్టవని ఆయన విమర్శించారు. ప్రజల కోసం తలపెట్టిన పట్టిసీమ, రాజధాని నిర్మాణాన్ని గతంలో వైసీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు. తెలంగాణలో ప్రాజెక్టుల కాంట్రాక్టులు దక్కించుకొని జగన్ ఇప్పుడు దీక్షల పేరుతో నాటకం ఆడుతున్నారని ప్రత్తిపాటి విమర్శించారు. ఎక్కడ దీక్షలు చేస్తే ఫలితం ఉంటుందో అక్కడ మాత్రం జగన్ దీక్షలు చేయబోరని ప్రత్తిపాటి వ్యాఖ్యానించారు. రాజధానిని అభివృద్ధి చేయొద్దని బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారని, అలా అనడం సరికాదని ప్రత్తిపాటి అన్నారు. కొత్తగా బీజేపీలో చేరినవారు, సీఎంతో విభేదించిన వారే ఇలా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. మిత్రభేదం ఉండకూడదని, కలసి ఉంటే హక్కులు సాధిస్తామని ఆయన పేర్కొన్నారు.