: పన్నెండేళ్ల వయస్సుకే పన్నెండో తరగతి పాసయ్యాడు!
రాజస్థాన్ లోని పన్నెండు సంవత్సరాల వయస్సు బాలుడు పన్నెండో తరగతి పాసై అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. రాజస్థాన్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఆర్బీఎస్) నిన్న వెలువరించిన పరీక్షా ఫలితాల్లో 12వ తరగతి ఫస్ట్ క్లాసులో పాసైన అబ్బాస్ శర్మకు అరవై ఐదు శాతం మార్కులు లభించాయి. దీంతో అబ్బాస్ ఆనందంలో మునిగి తేలుతున్నాడు. ఈ సందర్భంగా ఈ కుర్రాడు మాట్లాడుతూ, ఒకటో తరగతి చదువుకున్న తర్వాత కొన్ని తరగతులు జంప్ చేసి పైతరగతులకు వెళ్లానని చెప్పాడు. రెండేళ్ల క్రితం అంటే, పదేళ్ల వయస్సులో పదో తరగతి పాసయ్యానని.. ఇప్పుడు తనకు పన్నెండేళ్లని పన్నెండో తరగతి కూడా పాసయ్యానని చెప్పాడు. పన్నెండో తరగతి పరీక్షలనే ఆడుతుపాడుతూ రాశానని చెప్పాడు. తన కుటుంబం, టీచర్ల సహకారంతో ఈ విజయం తన సొంతమైందన్నాడు. క్లాసు రూంలో కూర్చుని పాఠాలు బట్టీ పట్టలేదని, కేవలం పరీక్షకు ముందు రోజు రాత్రి ప్రిపేర్ అయి రాశానని అబ్బాస్ శర్మ చెప్పాడు.