: 40 మందిని వదిలేసి గాల్లోకి ఎగిరిన స్పైస్ జెట్... నాలిక్కరుచుకుని కిందకు తెచ్చిన పైలట్!


అది కొచ్చి నుంచి ముంబై వెళ్లాల్సిన స్పైస్ జెట్ ఎస్జీ 154 విమానం. టేకాఫ్ కు సిద్ధంగా ఉన్న విమానాన్ని కొంతమంది ఎక్కేశారు. మరో 40 మందికి పైగా బస్సులో విమానాన్ని నిలిపివుంచిన రన్ వే పైకి వస్తున్నారు. ఇంతలో ఏమైందో ఏమో, ఎవరు క్లియరెన్స్ ఇచ్చారో... విమానాన్ని రన్ వేపై కి తీసుకు వెళ్లిన పైలట్ దాన్ని టేకాఫ్ చేశాడు. ఆపై బస్సులోని వారు గగ్గోలు పెట్టడంతో, వెంటనే విషయం పైలట్ కు చేరవేశారు ఏటీసీ అధికారులు. దీంతో నాలిక్కరుచుకున్న పైలట్ విమానాన్ని మళ్లీ ల్యాండ్ చేసి వారిని కూడా ఎక్కించుకుని వెళ్లగా, విమానం దాదాపు గంటా పదిహేను నిమిషాలు ఆలస్యం అయింది. ఈ ఘటన గత రాత్రి జరుగగా, మొత్తం విషయంపై స్పైస్ జెట్ వివరణ ఇచ్చింది. ముంబైలో విపరీతమైన ఎయిర్ ట్రాఫిక్ కారణంగా, 8:55 గంటల సమయంలో ల్యాండింగ్ కు అనుమతి లభించిందని, దీంతో కొచ్చి నుంచి బయలుదేరాల్సిన సమయాన్ని స్వల్పంగా మార్చామని చెప్పింది. చిన్న సమాచార లోపం కారణంగానే విమానం టేకాఫ్ అయిందని దీనిపై విచారణ జరుపుతున్నామని పేర్కొంది. కాగా, తాము బస్ లో రన్ వే పైకి వస్తుండగానే, ఓ విమానం టేకాఫ్ కు వెళుతూ కనిపించిందని అది తమదేనని అనుకోలేదని, జరిగిన ఘటనతో తాము 30 నిమిషాలకు పైగా వేచివుండాల్సి వచ్చిందని ప్రయాణికులు తెలిపారు. విమానం ఎక్కిన తరువాత తనకు తప్పుడు సమాచారం ఇచ్చిన సిబ్బందిపై పైలట్ కేకలు వేశాడని, తాను విమానం నడపనని తిడుతుంటే, సిబ్బంది బతిమాలుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఓ ప్రయాణికుడి లగేజ్ చెకిన్ అయిన తరువాత, అతను విమానం ఎక్కకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సదరు బ్యాగేజ్ ని దించే వరకూ విమానం కదలరాదన్న నిబంధన ఉందని ఐసీఏఓ సెక్యూరిటీ ఆఫీసర్ పి మోహనన్ గుర్తు చేశారు. కొచ్చిలో జరిగిన ఘటన భద్రతాపరంగా తీవ్ర తప్పిదమని అన్నారు.

  • Loading...

More Telugu News