: లోకేష్ ను 'మహేష్ బాబు'లా చేద్దామనుకుని, చివరికి 'సంపూర్ణేష్ బాబు'లా కూడా చేయలేకపోయిన చంద్రబాబు: వైకాపా సెటైర్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన కుమారుడు లోకేష్ ను సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు మహేష్ బాబులా చేద్దామని భావించారని, అయితే కనీసం సంపూర్ణేష్ బాబులా కూడా తయారు చేయలేకపోయారని వైకాపా ఏపీ రాష్ట్ర కార్యదర్శి భూషణం విమర్శించారు. కర్నూలులో జరుగుతున్న జగన్ జలదీక్షలో ఆయన పాల్గొని ప్రసంగించగా, అక్కడున్న ప్రజలు, వైకాపా కార్యకర్తల నుంచి మంచి మద్దతు లభించింది. వేదికపై నవ్వులు పూశాయి. లోకేష్ ను మోహన్ బాబులా తీర్చిదిద్దాలని భావించిన చంద్రబాబు, కనీసం బాబూ మోహన్ లా కూడా మార్చలేకపోయారని ఆయన మరో సెటైర్ వదిలారు. చంద్రబాబునాయుడు ఎక్కడ ఉంటే అక్కడ కరవు వుంటుందని, ఆయన వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడరని, తొలుత కాంగ్రెస్ కు, ఆపై పిల్లనిచ్చిన మామకు, అటుపై తమ్ముడు రామ్మూర్తి నాయుడికి, తోడల్లుడు దగ్గుబాటికి, చివరిగా జూనియర్ ఎన్టీఆర్ ను మోసం చేశారని దుయ్యబట్టారు. అబద్ధపు హామీలతోనే బాబు అధికారంలోకి వచ్చాడని ఆయన విమర్శించారు. ప్రజలకు మేలు కలగాలంటే జగన్ అధికారంలోకి రావాలని కోరారు. అవసరమైతే, కేసీఆర్ ఇంటి ముందు కూడా ధర్నా చేస్తామని ఆయన స్పష్టం చేశారు.