: ట్రంప్ వ్యాఖ్యలు వినడం కష్టంగా ఉంది: హాలీవుడ్ అందాల నటి ఏంజెలినా జోలీ
అమెరికా అధ్యక్షపదవి రేసులో తీవ్ర పోటీనిస్తోన్న డొనాల్డ్ ట్రంప్ ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ముస్లింలను అమెరికాలోకి రాకుండా చేస్తామని, ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు కౌంటర్ టెర్రరిజమ్ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి అనేక మంది ప్రముఖులతో విమర్శలు ఎదుర్కున్నారు. ఈ విషయంపై ట్రంప్‌ని తీవ్రంగా విమర్శిస్తోన్న వారి లిస్టులో తాజాగా హాలీవుడ్ అందాల నటి ఏంజెలినా జోలీ కూడా చేరిపోయారు. బీబీసీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రంప్ నుంచి ఇలాంటి కఠిన మాటలు వినాల్సిరావడం తనకు చాలా కష్టంగా ఉందని ఏంజెలినా జోలీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది ప్రజలు మతానికి అతీతంగా జీవనం కొనసాగించడానికి అమెరికాకి వచ్చారని, ట్రంప్ చేస్తోన్న వ్యాఖ్యలు తనకున్న విజన్‌కు వ్యతిరేకమని ఏంజెలినా జోలీ తెలిపారు. ఉన్నతమైన పదవికి పోటీ పడుతోన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు.