: ఆధార్ కార్డు గుర్తింపు కార్డు కాదా?... కానే కాదంటున్న ఎన్నికల అధికారులు!
గ్యాస్ కనెక్షన్, బ్యాంకు అకౌంట్, పాస్ పోర్టు, లోను... ఇలా ఏం కావాలన్నా ఆధార్ కార్డు కావాల్సిందే. అలాంటి ఆధార్ కార్డుకు ఎన్నికల కమిషన్ గుర్తింపు లేదన్న విషయం తెలిస్తే ఆశ్చర్యం కలగకమానదు. కేరళలో పోలింగ్ సందర్భంగా ఆధార్ వివాదం రాజుకుంది. పొన్నై నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ లో ఓటేసేందుకు ఓటర్లు క్యూ కట్టారు. అయితే ఆధార్ కార్డు ఐడీ కార్డుగా పని చెయ్యదని, ఓటర్ గుర్తింపు కార్డు తీసుకురావాలని అధికారులు వారిని తిప్పి పంపారు. దీంతో అధికారులు, ఓటర్లకు వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి పనికి ఆధార్ కార్డు అడుగుతుంటే...ఎన్నికల అధికారులు ఎందుకు దీనిని అంగీకరించడం లేదని వారు ప్రశ్నించారు. దీంతో ఎన్నికల సంఘం జారీ చేసిన 12 డాక్యుమెంట్లలో ఆధార్ కార్డుకు స్థానం దక్కలేదని, అందుకే దీనికి గుర్తింపు లేదని అధికారులు వెల్లడించారు. ఎలక్షన్ ఫోటో ఐడీ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఫోటోతో ఉన్న సర్వీస్ కార్డు, ఫోటోతో ఉన్న బ్యాంక్ పాస్ బుక్, ప్యాన్ కార్డు, ఎన్ పీఆర్ స్మార్ట్ కార్డు, ఉపాధి హామీ కార్డు, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు, పెన్షన్ డాక్యుమెంట్లు, ఓటర్ స్లిప్, ఎంపీ, ఎమ్మెల్యే ఐడీ కార్డులను ఐడీ కార్డులుగా అంగీకరిస్తామని వారు తేల్చి చెప్పారు. దీంతో చోటుచేసుకున్న వాగ్వాదం కారణంగా పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.