: రెచ్చగొట్టొద్దు.. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవద్దు: నాగం జనార్దన్ రెడ్డి
తెలంగాణ నిర్మిస్తోన్న సాగునీటి ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతోందంటూ వైఎస్సార్ సీపీ అధినేత జగన్ దీక్ష, ఏపీ ప్రభుత్వం కేసు వేయడానికి సిద్ధపడడం పట్ల బీజేపీ తెలంగాణ నేత నాగం జనార్దన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల కష్టాలను తీర్చేందుకు తలపెట్టిన ప్రాజెక్టులను అడ్డుకొని, తమను రెచ్చగొట్టొద్దని ఆయన అన్నారు. కృష్ణా జలాలు ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల రైతుల కష్టాలను తీరుస్తాయని, వాటిని ఉపయోగించుకోవడం అక్కడి ప్రజల హక్కని ఆయన ఉద్ఘాటించారు. తెలంగాణ ప్రజల హక్కులను హరించవద్దని, ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. ఎంతగా ప్రయత్నించినా తెలంగాణ ప్రాజెక్టులను ఆపలేరని, డిండి ఎత్తిపోతల పథకానికి దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే జీవో ఇచ్చారని నాగం పేర్కొన్నారు.