: కేసీఆర్ ని అడుగుతున్నా.. మీరు ప్రాజెక్టులు కడితే మాకు నీళ్లెలా వస్తాయి..?: జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దెబ్బతీసేలా తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు తలపెట్టిందని వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. కర్నూలులో వైసీపీ తలపెట్టిన మూడు రోజుల దీక్ష కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఏపీ ప్రజలకు కడుపునిండా బాధుందని, ఓవైపు ఎండలు ప్రజలను బయటకు రానివ్వడంలేదని, అయినా జనం దీక్షకు వచ్చారని వ్యాఖ్యానించారు. ‘తాము చేపడుతోన్న ప్రాజెక్టులతో ఏపీకి నీళ్లు రావని తెలిసినా తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేయడానికి ఏ మాత్రం వెనుకాడడంలేద’ని ఆయన అన్నారు. ఇటు వైపు కృష్ణానది, అటు వైపు గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు కడుతోందని ఆయన అరోపించారు. ‘కేసీఆర్ ని అడుగుతున్నా, మీరు ప్రాజెక్టులు కడితే మాకు నీళ్లెలా వస్తాయి..? అని జగన్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత‌్వం ఏపీ ప్రజల కళ్లెదుటే ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు కడుతోందని జగన్ అన్నారు. కృష్ణానదిలో మహారాష్ట్ర వారి అవసరాలు తీరితే తప్పా ఫడ్నవిస్ ప్రభుత్వం ఏపీకి నీళ్లు వదలడం లేదని జగన్ అన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర వారి అవసరాలు తీరిన తర్వాతే మనకు నీళ్లు వదులుతున్నారని ఆయన అన్నారు. మరో వైపు ఏపీలోని శ్రీశైలానికి నీళ్లు రాకముందే మధ్యలో మహబూబ్ నగర్‌లో తెలంగాణ 120 టీఎంసీల నీళ్లు తీసుకుపోతోందని ఆయన ఆరోపించారు. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా కోట్ల గుండెలు దీనిపై ఆందోళన చెందుతున్నాయని ఆయన అన్నారు. అయినప్పటికీ చంద్రబాబు వీటి పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు.