: ‘నీట్’పై మనకన్నా ఉత్తర భారత విద్యార్థులకే ఎక్కువ ఆందోళన: కడియం శ్రీహరి
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకోసం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నీట్ పై తెలుగు విద్యార్థులకు మరో రెండు రోజుల్లో స్పష్టతనిస్తామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఈరోజు హైదరాబాద్‌లో నిర్వహించిన నీట్ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. 370డి నిబంధనల ప్రకారం ప్రవేశాలు జరగాలని సుప్రీంను కోరుతున్నట్లు ఆయన తెలిపారు. నీట్ మాత్రం తప్పనిసరిగా నిర్వహిస్తారని విద్యార్థులకు ఆయన తెలిపారు. నీట్‌పై మనకన్నా ఉత్తర భారత విద్యార్థులే ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని కడియం శ్రీహరి చెప్పారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఇంగ్లీష్ భాషపై మంచి పట్టు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అయినప్పటికీ నీట్ ప్రశ్నపత్రం తెలుగులో ఇవ్వాలనే ప్రతిపాదనను సుప్రీం ముందుంచుతామని ఆయన తెలిపారు. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహించాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వ పరంగా పలు ప్రతిపాదనలు సుప్రీం ముందుంచనున్నట్లు ఆయన తెలిపారు. తెలుగులో పరీక్ష పెట్టాలని, అది కుదరకపోతే మరో ఏడాది తర్వాత నుంచి ఈ పరీక్షను నిర్వహించాలని కోరనున్నట్లు ఆయన తెలిపారు. ఈరోజు సాయంత్రం ఢిల్లీలో నీట్ పై చర్చించనున్నామని, రెండు రోజుల్లో నీట్ పై స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. అవసరమైతే గవర్నమెంట్ ఆధ్వర్యంలో నీట్ అభ్యర్థులకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు.