: తమిళనాడు, కేరళ, పుదుచ్ఛేరి అసెంబ్లీలకు ఎన్నికలు... మరికాసేపట్లో పోలింగ్
ప్రాంతీయ పార్టీలకు పెట్టని కోటగా ఉన్న తమిళనాడు సహా కేరళ, పుదుచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన క్రతువు పోలింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. తమిళనాట అధికార అన్నాడీఎంకేతో పాటు విపక్ష డీఎంకేకు చావో, రేవోగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న ఈ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో నేటి ఉదయం 232 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఈ స్థానాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు 3,776 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఓ రెండు నియోజకవర్గాల పోలింగ్ ను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఇక వామక్షాలకే కాకుండా కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్న కేరళలోనూ ఈ దఫా ఎన్నికలు రసవత్తరంగానే సాగనున్నాయి. కనీసం ఒక్క సీటైనా దక్కించుకుని ఆ రాష్ట్రంలో అడుగు పెట్టాలని బీజేపీ భావిస్తోంది. అయితే గడచిన ఎన్నికల మాదిరే ఈ దఫా కూడా బీజేపీకి సింగిల్ సీటు కూడా దక్కదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ బహిరంగ ప్రకటన చేశారు. మొత్తం 140 స్థానాలున్న ఆ రాష్ట్రంలో 1,203 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక తమిళనాడు రాజకీయాలతో ముడివడి ఉన్న పుదుచ్ఛేరి అసెంబ్లీకి కూడా నేడు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 30 సీట్లున్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు 344 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర ఎన్నికల సంఘం భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించింది.