: రాజ్యసభకు డీఎస్!... కూతురి సిఫారసుకు ఓకే చెప్పేసిన కేసీఆర్!
పార్లమెంటులో పెద్దల సభగా పేరుపడ్డ రాజ్యసభలోకి టీఆర్ఎస్ అభ్యర్థిగా సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి డి.శ్రీనివాస్ అడుగు పెట్టడం దాదాపుగా ఖరారైపోయింది. ప్రస్తుతం జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు రెండు స్థానాలు లభిస్తాయి. ఈ రెండింటి కోసం దాదాపు ఐదారుగురు సీనియర్లు పోటీ పడుతున్నారు. అయితే 32 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో తలపండిన డీఎస్... అందరికంటే ముందుగానే తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకున్నారు. నిజామాబాదు జిల్లాకు చెందిన డీఎస్... ఇటీవల పలుమార్లు అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓ దఫా ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా, దానిని తిరిగి కొనసాగించేందుకు మాత్రం ససేమిరా అంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ లోకి ఎంట్రీ ఇచ్చిన డీఎస్... తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహదారుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో రాజ్యసభ స్థానాలకు నేతలను ఎంపిక చేసే కసరత్తు ప్రారంభం కాకముందే డీఎస్...తన బీసీ కార్డును ప్రయోగించారు. పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనయ, నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత వద్ద తన మనసులోని మాటను బయటపెట్టిన డీఎస్... అటు నుంచి నరుక్కుంటూ వచ్చారు. డీఎస్ వాదన సరైందేనన్న భావనతో కవిత కూడా ఆయన పేరును తన తండ్రి వద్ద ప్రస్తావించింది. కవిత వాదనతో ఏకీభవించిన కేసీఆర్... డీఎస్ అభ్యర్థిత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. దీనిపై నేడో, రేపో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.