: లెక్కలేనన్ని నోట్ల కట్టలు, గుట్టల కొద్దీ బహుమతులు!... తమిళనాడులోని అరవకురిచిలో ఎన్నిక వాయిదా!
తమిళనాడు అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలకు సంబంధించి నిన్న కేంద్ర ఎన్నికల సంఘం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉచిత హామీల అమలుకు డబ్బులెక్కడి నుంచి తెస్తారో సమాధానం ఇవ్వాలంటూ అధికార అన్నాడీఎంకే, విపక్ష డీఎంకేలకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం... ఆ రాష్ట్రంలోని అరవకురిచి నియోజకవర్గానికి జరగాల్సిన ఎన్నికను ఏకంగా వాయిదా వేసింది. ఇందుకు ఈసీ తెలిపిన కారణాలు ఆసక్తికరంగా ఉన్నాయి. నియోజకవర్గంలోని ఆయా పార్టీ అభ్యర్థులు, నేతలపై వచ్చిన ఫిర్యాదులతో ఆదాయపన్ను శాఖ విస్తృతంగా దాడులు చేసింది. ఈ దాడుల్లో లెక్కకు మిక్కిలి కరెన్సీ కట్టలు, గుట్టల కొద్దీ బహుమతులు పట్టుబడ్డాయి. దీనిపై స్పష్టమైన సమాచారం అందుకున్న ఈసీ ఎన్నికను వాయిదా వేసేసింది. మిగిలిన అన్ని నియోజకవర్గాలకు ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ ఒక్క నియోజకవర్గానికి ఈ నెల 23న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది.