: ఏపీకి ప్రత్యేక హోదా రాదు!... తేల్చి చెప్పేసిన బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు


ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా?.., రాదా?... వచ్చి తీరుందని అధికార టీడీపీ ప్రభుత్వం బల్ల గుద్ది మరీ చెబుతోంది. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి అయినా సరే... ప్రత్యేక హోదాను సాధిస్తామని ఆ పార్టీ సీనియర్ నేతలు, కేబినెట్ లోని కీలక మంత్రులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇక ప్రత్యేక హోదా కోసం విపక్ష వైసీపీ అవకాశం చిక్కినప్పుడల్లా ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీకి చెందిన ఏపీ కీలక నేత, ఏపీ అసెంబ్లీలో ఆ పార్టీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు నిన్న విశాఖ కేంద్రంగా సంచలన ప్రకటన చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా రాదని ఆయన తేల్చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని ప్రకటించిన రాజు... ఆర్థిక సాయం మాత్రం అడిగిన దానికంటే ఎక్కువగానే అందే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ‘‘14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఏపీకి ప్రత్యేక హోదా రాదు. ప్రస్తుతం ఆ హోదా కింద నిధులు అందుకుంటున్న 11 రాష్ట్రాలను కూడా గడువు ముగియగానే మిగతా రాష్ట్రాలతో సమానంగా చూస్తారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కోసం మేమంతా కృషి చేస్తాం. తప్పకుండా సాధిస్తాం. సాధారణంగా జాతీయ ప్రాజెక్టులకు కేంద్రం 70 శాతం నిధులు ఇస్తుంది. మిగిలిన 30 శాతం నిధులను ఆయా రాష్ట్రాలే సమకూర్చుకోవాలి. కానీ పోలవరం విషయంలో మొత్తం నిధులను కేంద్రమే భరిస్తోంది’’ అని రాజు తన వాదనను వినిపించారు.

  • Loading...

More Telugu News