: భాగ్యనగరిలో మరోమారు గాలి వాన బీభత్సం!... పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం
భాగ్యనగరి హైదరాబాదులో మరోమారు గాలి వాన బీభత్సం సృష్టించింది. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ఈదురు గాలులతో కూడిన వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. నమోదైన వర్షపాతం పెద్దదేమీ కాకున్నా, భారీ వేగంతో వీచిన గాలులు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ నష్టాన్ని కలిగించాయి. ఈదురు గాలుల కారణంగా పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇందిరా పార్క్ సమీపంలో ఈదురు గాలులకు ఓ బాయ్స్ హాస్టల్ భవనం పైకప్పు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఇక బాగ్ లింగంపల్లిలోనూ ఓ ఇంటి పైకప్పు కూలడంతో ఆ ఇంటిలోని వృద్ధురాలు చనిపోయింది. ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు కూలిన కారణంగా పలు ప్రాంతాలు రాత్రంతా చీకటిలోనే మగ్గాయి.