: కేవీపీ బిల్లుకు భయపడి బీజేపీ పారిపోయింది...బాబుకి డెడె లైన్ ఈ నెల 17: చలసాని శ్రీనివాస్
కాంగ్రెస్ ఎంపీ కేవీపీ పెట్టిన బిల్లుకు భయపడి బీజేపీ పారిపోయిందని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ 6 వేల కోట్లకు పైగా నిధులు ఇచ్చామని పార్లమెంటు సాక్షిగా చెబుతుంటే, రాష్ట్రంలోని బీజేపీ నేతలు మాత్రం లక్షా 60 వేల కోట్ల రూపాయలు ఇచ్చామంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రం నుంచి తెచ్చిన లక్షా 60 వేల కోట్ల రూపాయలపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలో ఓ మాట, రాష్ట్రంలో ఓ మాట మాట్లాడడం కాకుండా, చేతనైతే కేంద్రంలో ఏ మాట మాట్లాడారో, అదే మాట రాష్ట్రంలో కూడా మాట్లాడాలని ఆయన సూచించారు. అంతెందుకు, బీజేపీ మోసం చేసిందని చెబుతున్న టీడీపీ నేతలను ఈ లెక్కలతో ఒప్పించాలని ఆయన బీజేపీ నేతలకు సవాలు విసిరారు. ఈ నెల 17 లోగా చంద్రబాబు ప్రత్యేకహోదాపై కేంద్రంతో ఓ ప్రకటన చేయిస్తే బాగుంటుందని, లేదంటే ఈ నెల 22 నుంచి ప్రత్యేకహోదాపై మహాఉద్యమం మొదలవుతుందని ఆయన చెప్పారు.