: డే కేర్ సెంటర్‌లో దారుణం.. మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి
పోటీ ప్రపంచంలో తమ చిన్నారులను డే కేర్ సెంటర్లలో వదిలివెళుతున్న తల్లిదండ్రులు అక్కడ వారు చేసే చేష్టలను తెలుసుకొని తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. తమకు చిన్నారుల తల్లిదండ్రులు అప్పగించిన బాధ్యతల పట్ల డే కేర్ నిర్వాహకులు తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. డే కేర్ సెంటర్లో ఉంచిన ఓ చిన్నారి అక్కడి 46 ఏళ్ల వ్యక్తి చేతిలో లైంగిక దాడికి గురయిన సంఘటన తాజాగా పశ్చిమ బెంగళూరులోని జగజ్జీవన్ రామ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సంధ్య బరాడియా అనే మహిళ ఓ డే కేర్ సెంటర్‌ను నిర్వహిస్తోంది. డే కేర్‌లో ఇటీవల ఓ రోజు ఉదయం తమ మూడేళ్ల చిన్నారిని వదిలి వెళ్లిన తల్లిదండ్రులు సాయంత్రం మళ్లీ తమ ఇంటికి తీసుకెళ్లారు. అయితే, ఇంట్లో తీవ్రంగా కడుపు నొప్పితో బాధపడుతోన్న తమ చిన్నారిని తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పరీక్షలు నిర్వహించిన డాక్డర్లు ఆ చిన్నారి లైంగిక వేధింపులకు గురయిందని తెలిపారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేబట్టి పలు వివరాలు వెల్లడించారు. ఆ డే కేర్‌ను సంధ్య బరాడియా అనే మహిళ ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే నిర్వహిస్తోందని, ఆ మహిళ భర్తే మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపారు. డే కేర్ నిర్వహిస్తోన్న మహిళను, చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డ ఆమె భర్తను అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.