: బూతులు తిడుతున్నాడని కన్నతండ్రిని చంపి, వీడియోలో విషయం చెప్పిన మీరట్ బాలికలు!


కళ్లల్లో పెట్టుకుని కాపాడుకోవాల్సిన కన్న తండ్రి ప్రతి నిత్యమూ బూతులు తిడుతుంటే, తట్టుకోలేకపోయిన ఆ టీనేజ్ అక్కా చెల్లెళ్లు ఘోర నిర్ణయం తీసుకున్నారు. కిరాతకంగా తండ్రిని చంపడంతో పాటు తాము చేసిన నేరాన్ని గురించి చెబుతూ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఇప్పుడా వీడియో వైరల్ అవుతుండగా, పోలీసులు దాన్ని నమ్మడం లేదు. మీరట్ లోని మెడికల్ కాలేజ్ ఏరియా పోలీసు స్టేషన్ ఆఫీసర్ రవీంద్ర కుమార్ కథనం ప్రకారం, ఈ బాలికల తండ్రి కరణ్ సింగ్ నిత్యమూ తాగుతుంటాడు. నిన్న తెల్లవారుఝామున నియంత్రణలో లేని స్థితిలో ఇంటికి చేరుకోగా, ఆ మత్తులో అతని తల బావి గోడకు తగిలి తీవ్ర గాయమై బావిలో పడ్డాడు. కరణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని రవీంద్ర వివరించారు. కానీ, బాలికలు పోస్ట్ చేసిన వీడియోలో "అవును మేము మా తండ్రిని చంపాము. ఎందుకంటే, బూతులు తిడుతూ, మమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నించాడు. ఓ సుత్తి తీసుకుని అతని తలపై బాదాము. కనీసం అతను చస్తేనైనా మాకు సమస్యలు తగ్గుతాయని భావించాం" అని చెప్పారు. ఈ వీడియోలో రక్తంతో తడిసిన ఓ సుత్తి కూడా కనిపిస్తోంది. కాగా, భర్త మరణించాడని తెలియగానే, కరణ్ భార్య తన ఐదేళ్ల కుమారుడిని తీసుకుని వెళ్లిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. విషయం వివాదం కావడంతో పోస్టుమార్టం నివేదిక చూసిన తరువాత తాము ఓ నిర్ణయానికి వస్తామని ఎస్పీ ఓం ప్రకాష్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News