: 17 మంది కాదు, 47 మంది... వైసీపీ ఎమ్మెల్యేలు ఇంకా వస్తున్నారు!: అచ్చెన్నాయుడు
మరింత మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి రానున్నారని, ఇందుకోసం తనతో పాటు, తమ పార్టీ ఇతర నేతలతో వారంతా మాట్లాడుతున్నారని కార్మిక శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఇప్పటికి వచ్చినవారు 17 మందైతే, మరో 30 మంది త్వరలో రానున్నారని, మొత్తం 47 మంది అవుతారని తెలిపారు. నిన్న రాత్రి శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగిన పార్టీ సభలో ఆయన ప్రసంగించారు. వైకాపాలోని ఎమ్మెల్యేలకు, జగన్ పై నమ్మకం మరింతగా దిగజారిపోయిందని, అందువల్లే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారని అన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఓ దినపత్రికను, టీవీ చానల్ ను పెట్టుకుని సొంత డబ్బా కొట్టుకుంటున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకరించడం లేదని, అందువల్లే ఇబ్బందులు తలెత్తుతున్నాయని అచ్చెన్నాయుడు తెలిపారు.