: చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి వచ్చాక... బీజేపీకి సమాధానంపై కసరత్తు!
కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రస్తుతం తిరుగు ప్రయాణంలో వున్నారు. వచ్చాక రెండు రోజుల పాటు అమరావతిలోనే ఉండి, నిన్నటి బీజేపీ కోర్ కమిటీ సమావేశం అనంతరం ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై నేతలతో చర్చించనున్నారని తెలుస్తోంది. ఈ నెల 17న ప్రధానితో ఆయన సమావేశం కానుండగా, అక్కడ ఏం మాట్లాడాలన్న విషయమై రెండు రోజుల పాటు వివిధ శాఖల మంత్రులు, అధికారులతో సమీక్షలు జరపనున్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని బీజేపీ నేతలు కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంతో, ఈ విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ముందుకు సాగడమెలా అనే అంశంపైనే ఆయన ప్రధానంగా దృష్టి సారించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ప్రధానితో సమావేశమైన సమయంలో ముందుగా మౌఖిక, ఆపై చిత్ర రూపంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, అందుకు తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు ప్రధానికి వివరించనున్నట్టు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. కేంద్రం ఇచ్చిన నిధుల ఖర్చు తదితరాలపై బీజేపీ నేతలు సంధించిన ప్రశ్నలకు తగిన సమాధానం చెప్పాలన్నది ఆయన అభిమతంగా తెలుస్తోంది.