: ఆల్ ఖైదా అధినేతగా ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జాబిన్ లాడెన్?


వారసత్వమనేది అధికారానికి, ఆస్తులకే కాదు తీవ్రవాదానికి కూడా పాకుతోంది. అమెరికాను గజగజా వణికించిన 'ఆల్ ఖైదా' నేత ఒసామా బిన్ లాడెన్ కు ఇప్పుడు వారసుడు పుట్టుకొచ్చాడు. స్వయంగా తండ్రి దగ్గర తీవ్రవాదంలో శిష్యరికం చేసిన తనయుడు హమ్జా బిన్ లాడెన్ తెరపైకి దూసుకువస్తున్నాడు. ఇన్నాళ్లు మరణించాడని భావిస్తున్న హమ్జా బిన్ లాడెన్ వీడియోలో కనిపించడంతో అమెరికా కలవరపడుతోంది. తండ్రిని చంపిన అమెరికాపై అతను ఎలాంటి ప్రతీకారచర్యలకు పాల్పడే అవకాశముందో ఆలోచిస్తోంది. ఇదే సమయంలో అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అతని గురించిన వివరాల కోసం ఆరాతీస్తున్నాయి. తాజాగా ఆల్ ఖైదా విడుదల చేసిన వీడియోలో అధినేత అల్ జవహరి తరువాత హమ్జా మాట్లాడి తీవ్రవాదుల్లో స్పూర్తి నింపే ప్రయత్నం చేశాడు. ఇరాక్ సిరియాల్లో ఉండే తీవ్రవాదులంతా ఏకంకావాలని ఆ వీడియోలో పిలుపునిచ్చాడు. ఇస్లామిక్ ఉమ్మా (జాతి), అల్ శ్యామ్ (సిరియా)ను బలోపేతం చేయాలని సూచించాడు. ముస్లిం ప్రపంచానికి వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం ఏకమైందని ఈ వీడియోలో ఆరోపించాడు. అప్పట్లో తండ్రి హతమైన ఐదు నెలల తరువాత హమ్జా తొలిసారి వీడియోలో మాట్లాడాడు. అయితే ఆ వీడియోలో మాట్లాడింది అతను కాదని, గొంతు ఆయనది కాదని వ్యాఖ్యానాలు వినిపించాయి. తాజాగా విడుదల చేసిన వీడియోలో ఇలాంటి అనుమనాలేవీ రేగలేదు. అయితే హమ్జా పిలుపుతో తీవ్రవాదులు ఏకమైతే అమెరికాకు పెను ముప్పు పొంచి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News