: చైనా సైనికులు 19 కిలోమీటర్లు చొచ్చుకొచ్చారు: ప్రభుత్వం
చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన 30 దళాలు భారత భూభాగంలోకి 10 కిలోమీటర్లు కాదు.. 19 కిలోమీటర్ల ముందుకు చొచ్చుకు వచ్చాయి. జమ్మూ కాశ్మీర్ లోని లడక్ లో ఎత్తయిన పర్వత ప్రాంతంలో డెప్సాంగ్ బల్గే దగ్గర టెంట్లు వేసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి శశికాంత్ శర్మ స్వయంగా ఆ శాఖా వ్యవహారాలను పర్యవేక్షించే పార్లమెంటరీ స్థాయి సంఘానికి నివేదించారు.అయితే, తమ దళాలను ఉపసంహరించుకోవడానికి చైనాకు తగిన సమయం ఇచ్చామని చెప్పారు. సరిహద్దులలో మరింత క్షుణ్ణంగా నిఘా వేసేందుకు మరిన్ని బలగాలను అక్కడకు పంపామని చెప్పారు.
మొత్తానికి తమ చర్య ద్వారా చైనా సైనికులు భారత సర్కారుకు సవాల్ విసిరారు. భారత భూభాగంలోకి వచ్చి 10 రోజులు గడచినా, ఇరు సైన్యాల మధ్య మూడు సార్లు ఫ్లాగ్ మీటింగ్ జరిగినా వారు వెనక్కి తగ్గలేదు. 16,350 అడుగుల ఎత్తయిన ప్రాంతంలో పాగా వేసి ఏం చేసుకుంటారో చేసుకోండి ఇక్కడి నుంచి కదలేది లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, సైన్యంతో పాటు, వాయుసేన విభాగాలను కూడా అప్రమత్తం చేసింది. వాస్తవానికి ఈ విషయంలో గట్టిగా వ్యవహరిస్తే ఎటు దారి తీస్తుందో అన్న ఆందోళన భారత సర్కారులో ఉంది. అందుకే ఓపికగా వ్యవహరిస్తోంది.