: ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజీ మధ్యతేడా 'టెక్నికల్' పదమే: ఏపీ బీజేపీ కోర్ కమిటీ
ఏపీకి ప్రత్యేకహోదా, ప్యాకేజీకి మధ్య చిన్న తేడా ఉందని, అది టెక్నికల్ పదంతో కూడిన తేడాయే తప్ప ఇంకేమీ కాదని బీజేపీ కోర్ కమీటి సమావేశం అనంతరం ఏపీ ఇన్ఛార్జీ సిధ్ధార్థ్ నాధ్ సింగ్ తెలిపారు. విజయవాడలో ఏపీ బీజేపీ కోర్ కమిటీ కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీనిపై కోర్ కమిటీ సభ్యుడు సిద్ధార్థ్ నాధ్ సింగ్ మాట్లాడుతూ, ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీజేపీ భావిస్తోందని అన్నారు. ఇప్పటి వరకు ఏపీకి ఇచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన సూచించారు. ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజీ అనేవి భావోద్వేగ సమస్యలేనని ఆయన స్పష్టం చేశారు. ఈ నెలాఖరులో ఢిల్లీకి వెళ్లి ప్రధానితో మాట్లాడి, ప్యాకేజీ, హోదాపై మాట్లాడుతానని ఆయన చెప్పారు. ప్రత్యేకహోదాను విభజన చట్టంలో పేర్కొనలేదని ఆయన చెప్పారు. విభజన చట్టంలో ఉన్నవన్నీ నెరవేరుస్తామని ఆయన చెప్పారు. చట్టంలో లేకపోయినప్పటికీ 6,403 కోట్ల రూపాయలు నిధులను విడుదల చేశామని ఆయన తెలిపారు. ప్రత్యేకహోదాపై ఏపీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. పార్టీ సమవేశాల్లో చర్చించిన అంశాలను అమిత్ షాకు వివరిస్తామని ఆయన తెలిపారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఏపీలో జాతీయ రహదారుల కోసం 65 వేల కోట్ల రూపాయలు మంజూరు చేసిందని ఆయన అన్నారు. వచ్చేనెలలో అమిత్ షా ఏపీలో పర్యటిస్తారని, బూత్ స్థాయిలో పార్టీని పటిష్ఠం చేయడమే బీజేపీ ముందున్న లక్ష్యమని ఆయన తెలిపారు.