: దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు: అందాల తార ఐశ్వర్యారాయ్ బచ్చన్
దేవుడు తనకు అన్నీ ఇచ్చాడని, ఫలితాన్ని ఆశించకుండా పనిచేసుకు పోవడమే తన తత్వం అని బాలీవుడ్ హీరోయిన్, ప్రపంచ మాజీ సుందరి ఐశ్వర్యాబచ్చన్ అన్నారు. ఆమె నటించిన తాజా చిత్రం ‘సరబ్ జిత్’ త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐశ్వర్య మాట్లాడుతూ, ‘కోరికలంటారా, దేన్నీ ఓ లక్ష్యంగా పెట్టుకోలేదు. దేని గురించీ వెతుకులాట లేదు. అందువల్లేనేమో నేననుకున్నది పూర్తయింది. ఇక చాలని అనుకోలేదు. నేను ఎక్కడికి వెళ్లినా నాలాగానే ఉంటాను. నేను తల్లిదండ్రుల చాటు బిడ్డని. వ్యక్తిగత జీవితంలో గానీ, వృత్తిపరమైన జీవితంలో గానీ నేను తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక వారి ప్రభావం ఉంటుంది. నా నడవడిక కూడా తల్లిదండ్రులు నాకు ఏం చెప్పారో అలాగే సాగుతుంది, ఎక్కడికి వెళ్లినా ఐశ్వర్య లాగానే ఉంటాను. ఏ రంగంలో అడుగుపెట్టినా అలాగే ఉంటాను, నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను, అలానే ఉంటాను. ఒక కళాకారిణి కోణంలో చూస్తే, నేనెప్పుడూ విద్యార్థినే, నా వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు లేదు. ఓ పనిని అంగీకరిస్తే, కట్టుబడి ఉండటం, అంకిత భావంతో పనిచేయడం అనేది చాలా ముఖ్యం. మనం చేస్తున్న పనిని గౌరవించాలి, తోటివారితోనూ అలాగే ప్రవర్తించాలి, ఈ విలువలను పాటిస్తే పనిని ఉత్సాహంగా పూర్తి చేయడంలో ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఎక్కడ ఉన్నా సంయమనాన్ని కోల్పోకూడదు, తద్వారా సుదీర్ఘకాలం పనిచేయగలుగుతాము’ అని ఆమె అన్నారు. ‘సరబ్ జిత్’ చిత్రం విషయానికి వస్తే.. ఇది తనకు చాలా ముఖ్యమైనదని, ఈ చిత్రం కథ నిజజీవితానికి సంబంధించిందని చెప్పారు. ఇంకా పలు విషయాలపై అందాల తార ఐశ్వర్యారాయ్ బచ్చన్ మాట్లాడారు.