: హైదరాబాద్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం... ఇళ్లవైపు మంటలు!
హైదరాబాద్ శివార్లలోని నాచారం పారిశ్రామికవాడలో ఉన్న ఒక రసాయన కర్మాగారంలో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీలోని రియాక్టర్ పేలడంతో భారీ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఉదయం 9 గంటల సమయంలో తొలి పేలుడు వినిపించగా, అప్పటికే అక్కడ ఉన్న కార్మికులను అలర్ట్ చేస్తూ అలారం మోగింది. దీంతో సిబ్బంది, ఉద్యోగులంతా బయటకు రాగా, ఇప్పటికి కూడా కెమికల్ సిలిండర్లు పేలుతూనే వున్నాయి. దట్టమైన పొగలు దాదాపు 200 అడుగులకు పైగా ఎగిసి, మల్లాపూర్ వరకూ ఐదు కిలోమీటర్ల దూరం కమ్మేయగా, సమీపంలోని ఓ ఇల్లు కూడా మంటల్లో చిక్కుకుంది. సంఘటనా స్థలికి చేరుకున్న నాలుగు ఫైరింజన్లు ఒకవైపు మంటలను ఆపేందుకు శ్రమిస్తుండగా, మరోవైపు మంటలు విస్తరిస్తుండటంతో సమీప ప్రాంతాల ప్రజలను హుటాహుటిన తరలిస్తున్నారు. మరిన్ని ఫైరింజన్లు, విపత్తు సహాయక సిబ్బంది వస్తున్నట్టు అధికారులు తెలిపారు.