: అఖిలేష్ సతీమణి డింపుల్ యాదవ్ లో ప్రసంగోత్సాహం... 'రాహుల్ గాంధీకి ఫిమేల్ వర్షన్' అంటున్న నెటిజన్లు
డింపుల్ యాదవ్... ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సతీమణి. సమాజ్ వాదీ పార్టీ తరఫున ఎంపీ కూడా. లోక్ సభలో ఆమె ఇటీవలి ప్రసంగం ఒకటి సామాజిక మాధ్యమాల్లో సునామీలా దూసుకెళుతోంది. రాహుల్ గాంధీ ఓ మహిళ అయితే, ఎలా మాట్లాడి వుండేవారో తెలుసుకోవాలంటే, డింపుల్ స్పీచ్ చూస్తే సరిపోతుందని నెటిజన్లు సెటైర్లు వేసుకుంటున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే, మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగిక అత్యాచారాలపై మాట్లాడేందుకు లోక్ సభలో ఆమెకు అవకాశం లభించింది. డింపుల్ కు స్పీకర్ పది నిమిషాల సమయం ఇచ్చారు. లోక్ సభలో తొలి ప్రసంగావకాశాన్ని ఎనలేని ఉత్సాహంతో అందుకున్న డింపుల్, తన పర్సనల్ అసిస్టెంట్ (ఆమె రాసుకుని ఉండొచ్చు కూడా) రాసిచ్చిన విషయాన్ని గుక్క తిప్పుకోకుండా చదువుతూ వెళుతుంటే, పక్కవారు నవ్వాపుకునేందుకు అవస్థలు పడాల్సి వచ్చింది. ఇంగ్లీష్ మీడియంలో మూడు, నాలుగు తరగతులు చదువుతున్న పిల్లలు మాట్లాడే నాణ్యతతో ఉన్న ఆంగ్ల పదాలను వాడుతూ సాగిన ప్రసంగం ఇప్పుడు నెటిజన్ల మధ్య తాజా చర్చ. రాహుల్ సైతం ఇలాగే మాట్లాడతాడంటూ, డింపుల్ ప్రసంగానికి చివర రాహుల్ లోక్ సభలో మాట్లాడిన ఓ ప్రసంగాన్ని జోడించి వదిలితే, అది కూడా వైరల్ అవుతోంది.