: స్పైసీ గర్ల్స్ మళ్లీ కలిశారు... దుమ్ము రేపుతారట!
స్పైసీ గర్ల్స్... నేటి టీనేజర్లకు వీరు పరిచయం ఉండకపోవచ్చేమోగానీ, ఓ 20 ఏళ్లక్రితం టీనేజర్లుగా ఉన్న వారందరికీ వీరేంటో, పాప్ మ్యూజిక్ ప్రపంచంలో వీరు సృష్టించిన సంచలనం ఏంటో తెలుసు. దాదాపు 20 ఏళ్ల క్రితం నుంచి ఒక్కొక్కరిగా విడిపోయిన వీరు, తిరిగి కలిశారు. ఓ వారం పాటు రహస్యంగా కలిసిన వీరు, దుమ్ము రేపే సాంగ్ కంపోజ్ చేశారని, అది బయటకు వచ్చి రికార్డులు బద్దలు చేస్తుందని బ్రిటన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ బ్యాచ్ లో ఐదుగురు యువతులు ఉండగా, వీరంతా పదహారేళ్ల తరువాత తిరిగి ఓ సాంగ్ రికార్డు చేసినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని స్పైసీ గర్ల్స్ బ్యాండ్ ప్రొడ్యూసర్ ఎలియట్ కెన్నడీ స్పష్టం చేశారు. చరిత్రలో ఇది నిలిచిపోయే రోజని, మంచి స్నేహితుల మధ్య ఇరవై సంవత్సరాల దూరం ఏర్పడకుండా ఉండాల్సి వుందని, ఇదో హిట్ సాంగని తన సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ఇక ఈ పాట ఎప్పుడు విడుదలవుతుందా అని ప్రస్తుతం 40వ దశకంలో ఉన్న వారంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.