: తమ్ముడు స్టాలిన్ నాతో మాట్లాడి మూడేళ్లవుతోంది: ఎంకే అళగిరి
డీఎంకే నేత, తన తమ్ముడు స్టాలిన్ తనతో మాట్లాడి మూడేళ్లవుతోందని అతని సోదరుడు ఎంకే అళగిరి అన్నారు. ఈ మూడు సంవత్సరాలలో సవతి సోదరి కనిమొళి కూడా తనతో మాట్లాడలేదని చెప్పారు. వచ్చే వారంలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈసారి ఎన్నికలలో తాను ఏ పార్టీకి ఓటు వేయనని చెప్పారు. త్వరలో జరగనున్న ఎన్నికలలో మధురై జిల్లా నుంచి ఒక్క సీటు కూడా డీఎంకే గెలిచే అవకాశాలు లేవని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాగా, డీఎంకే అధినేత కరుణానిధి తన వారసుడు స్టాలిన్ అని తాజాగా మరోసారి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పార్టీ ఎన్నికల ప్రచారానికి అళగిరి దూరంగా ఉన్నట్లు సమాచారం. స్టాలిన్ మాత్రం ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో దూసుకుపోతున్నారు.