: 'ప్రియాంకా... ప్రియాంకా'... యూపీ కాంగ్రెస్ ఏకైక నినాదమిదే!


2017లో ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే, ఒకే ఒక్క మార్గముందని, అది ప్రియాంకను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావడమేనని కాంగ్రెస్ వర్గాలు అధిష్ఠానంపై ఒత్తిడి పెంచుతున్నాయి. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి రంగంలోకి దిగిన ప్రశాంత్ కిషోర్, రాష్ట్రంలోని వివిధ జిల్లాల కాంగ్రెస్ నేతలతో జరిపిన సమావేశంలో ప్రియాంక వస్తే, యూపీలో అధికారం పొందేందుకు వీలుంటుందని నేతలంతా ముక్తకంఠంతో చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రియాంక జపమే జరిగిందని, ఆమెను ఎలాగైనా ఒప్పించి యూపీలో నిలపాలని ప్రశాంత్ కిషోర్ కు నేతలంతా వెల్లడించినట్టు ఆగ్రా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుష్యంత్ శర్మ వెల్లడించారు. ఇప్పటికే ఒపీనియన్ పోల్స్ లో పార్టీ ఓటు శాతం పెరిగినట్టు వెల్లడైందని గమనించిన ప్రశాంత్, ఇక ప్రియాంకను ముందు నిలిపితే, ఇందిరాగాంధీని మరోసారి ప్రజలకు చూపినట్టుగా అవుతుందని, ఓట్లు మరింతగా వస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు. కాగా, యూపీలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాహుల్, ప్రియాంక లేదా ఓ బ్రాహ్మణ అభ్యర్థిని నిలపాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ప్రశాంత్ కిషోర్ కోరినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. త్వరలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలను రాహుల్ స్వీకరిస్తారన్న అంచనాల నేపథ్యంలో ఆయన్ను యూపీకి మాత్రమే పరిమితం చేయరాదని కాంగ్రెస్ సీనియర్లు భావిస్తున్నారు. దీంతో ప్రియాంకా గాంధీని తేవాలన్న ఒత్తిడి అధికమవుతోంది. ఈ విషయంలో సోనియా నోటివెంట ఇంకా ఎటువంటి వ్యాఖ్యా రాలేదు. ఇదిలావుండగా, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యాలయాలను విస్తృతంగా ఏర్పాటు చేసుకోవాలని, వాటికి అద్దెను పార్టీ చెల్లిస్తుందని ప్రశాంత్ చోటా నేతలకు స్పష్టం చేసినట్టు సమావేశం. ప్రజలతో మమేకం కావాలని, బ్రాహ్మణ ఓట్లు చేజారకుండా చూసుకోవాలని కూడా ఆయన వెల్లడించినట్టు శర్మ తెలిపారు. 2007లో బీఎస్పీ, 2012లో ఎస్పీ అధికారంలోకి రావడానికి బ్రాహ్మల ఓట్లే కారణమని గుర్తు చేసిన ప్రశాంత్, వారికి దగ్గరైతే సగం గెలిచినట్టేనని అన్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News