: పనామా పేపర్స్ లో ‘ఎర్ర’ డాన్?... కలకలం రేపుతున్న గంగిరెడ్డి పేరు!
ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేతదారులను నడి బజారుకీడ్చిన పనామా పేపర్స్... తాజాగా తెలుగు నేలలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే అధికార టీడీపీ, విపక్ష వైసీపీ అధినేతలకు చెందిన అత్యంత సన్నిహితుల పేర్లు ఈ పేపర్లలో వెలుగు చూశాయి. ఇక ఆ పేపర్లలోని ఓ పేరు పోలీసులను షాక్ కు గురి చేస్తోంది. పన్ను ఎగవేతే ప్రధాన లక్ష్యంగా బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్స్ లో కంపెనీలు ఏర్పాటు చేసిన వ్యక్తుల్లో గంగిరెడ్డి పేరు కనిపించింది. తెలుగు నేలలో గంగిరెడ్డి అంటే తెలియని వారుండరు. కడప జిల్లాకు చెందిన కొల్లం గంగిరెడ్డి... ఎర్రచందనం అక్రమ రవాణాలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం జైల్లో ఉన్న అతడికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనూ సంబంధాలున్నాయని గతంలో అధికార టీడీపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్న ఆన్ లైన్ లోకి వచ్చేసిన పనామా పేపర్స్ లో కనిపించిన గంగిరెడ్డి పేరుపై పెద్ద చర్చే జరుగుతోంది. అయితే ఈ గంగిరెడ్డి... కొల్లం గంగిరెడ్డా? లేక మరో వ్యక్తా? అన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు. ఈ పేరు గుట్టుమట్లను నిగ్గు తేల్చేందుకు ఇఫ్పటికే పోలీసులు రంగంలోకి దిగారు.